కండల వీరుడి బెయిల్ రద్దు లేదు
బాలీవుడ్ కండల వీరుడు కమ్ కథా నాయకుడు సల్మాన్ ఖాన్ బెయిల్ రద్దు చేయాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు గురించి చాలామందికి తెలుసు. ముంబయిలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న వారి మీదకు కారు పోనివ్వడంతో ఒకవ్యక్తి చనిపోయి నలుగురు గాయపడ్డారు ఈ కేసులో కింది కోర్టు సల్మాన్ దోషిగా నిర్థారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
మరుక్షణమే సల్లూ భాయ్ బాంబే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే ఇప్పటివరకు జైలు ముఖం చూడలేదన్న మాట. ఈ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధితుల్లోనే ఒకరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తిరస్కరణతో సల్మాన్ చాలా సంతోషించి ఉంటాడు. ఆయనకు మరింత ఊరట కలిగింది. ఈ కేసు మళ్లీ ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు. రెండు వేల రెండో సంవత్సరం నాటి హిట్ అండ్ రన్ కేసు విచారణ ఏళ్ల తరబడి సాగింది. ఈ ఏడాది మే ఆరో తేదీన సెషన్‌్స కోర్టు సల్మాన్‌కు శిక్ష విధించింది. సుమారుగా పదమూడు సంవత్సరాలు నడిచిన ఈ కేసులో సల్మాన్ ఇప్పటి వరకు బయటే ఉండటం అతని అదృష్టమనుకోవాలో, మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు విచారించాలో అర్థం కాదు. సల్మాన్ ఖాన్ కారు ఢీ కొట్టినప్పుడు బతికిన నలుగురిలో ఏ ఒక్కరైనా హీరోకు శిక్ష పడితే చూస్తారా? అనేది చెప్పలేం. అయితే సల్మాన్ తనంతట తాను అంటే ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదని సెషన్‌్స కోర్టు అభిప్రాయపడింది. అయితే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు కాబట్టి ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే ఏ కేసులోనైనా శిక్ష పడిన నిందితుడిని వెంటనే జైలుకు తరలిస్తారు. ఆ తరువాత అతను బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటాడు. బెయిల్ ఇస్తారా? ఇవ్వరా? అనేది వేరే విషయం. కాని సల్మాన్ విషయంలో అతను జైలు ముఖం చూడకుండానే హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇలా బెయిల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. విమర్శలు వచ్చాయి. పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు కూడా.
No comments:
Post a Comment